Iran: శత్రువులకు షాక్ ఇచ్చిన ఇరాన్ – యుద్ధరంగంలో ‘డ్యాన్సింగ్ మిసైల్’ వినియోగం
యుద్ధరంగంలో ‘డ్యాన్సింగ్ మిసైల్’ వినియోగం

Iran: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిదాడిగా ఇరాన్ తీవ్రమైన క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై భారీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో టెహ్రాన్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఇరాన్ తన అత్యాధునిక ‘సెజ్జిల్’ క్షిపణిని యుద్ధంలో తొలిసారిగా ప్రయోగించింది. ఇది ‘డ్యాన్సింగ్ మిసైల్’ అని ప్రపంచ మీడియా పేర్కొంటోంది.
ఈ క్షిపణి ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారైంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. అధిక ఎత్తులో తిరుగుతూ, అకస్మాత్తుగా మార్గం మార్చుకునే సామర్థ్యం. దీంతో ఐరన్ డోమ్ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలను సులభంగా తప్పించుకుని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అందుకే దీనిని ‘డ్యాన్సింగ్ మిసైల్’ లేదా ‘అషూరా’ అని పిలుస్తారు.
సెజ్జిల్ క్షిపణి రేంజి 2,000 కిలోమీటర్లకు పైగా ఉంది. 700 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం.. ఈ క్షిపణి పొడవు దాదాపు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, బరువు 23,600 కిలోగ్రాములు.
ఇరాన్ 1990ల్లో ఈ క్షిపణి అభివృద్ధిని ప్రారంభించింది. 2008లో తొలి పరీక్ష ప్రయోగం జరిగింది. ఆ సమయంలో 800 కిలోమీటర్లు ప్రయాణించింది. 2009లో మెరుగైన నావిగేషన్ సిస్టమ్‌తో మరో పరీక్ష జరిగింది. తర్వాత పలుమార్లు పరీక్షలు నిర్వహించారు. ఒక ప్రయోగంలో హిందూ మహాసముద్రంలోకి 1,900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సమాచారం.
ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఈ అధునాతన క్షిపణిని ఉపయోగించడం ద్వారా ఇరాన్ తన సైనిక బలాన్ని మరింత ప్రదర్శించింది. ఈ దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాలు, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.

