Iran Warns: దాదాపు 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో ప్రపంచ వాణిజ్య నౌకల రవాణా సాఫీగా సాగుతుందని అందరూ భావించారు. అయితే, హర్మూజ్ తెరిచినా ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనాలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు ఉద్రిక్తతలను మరోసారి పెంచేశాయి.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. దిగ్బంధనాలు కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేస్తూ, “హర్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందాలు తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే ఏడు పోస్టులు చేశారు. అవన్నీ అబద్ధాలే” అని తీవ్రంగా విమర్శించారు.

దౌత్య చర్చలు ముందుకు సాగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ ఎంతమాత్రం అంగీకరించదని ఘాలిబఫ్ స్పష్టం చేశారు. “అబద్ధాలతో యుద్ధం గెలవలేము. చర్చల్లో కూడా పురోగతి సాధించలేము” అని ట్రంప్‌ను ఎదిరించారు. దిగ్బంధనాలు ఇలాగే కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామని హెచ్చరించారు.

ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా-ఇరాన్ మధ్య ఏప్రిల్ 20న మరో మారు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయని ఇరాన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై అమెరికా వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రపంచ చమురు సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత గతంలోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే చర్చలు ఎలా సాగుతాయనేది అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story