Iran Warns: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు – దాడి చేస్తే సీమైన్స్‌తో ప్రతిస్పందిస్తామన్న ఇరాన్
దాడి చేస్తే సీమైన్స్‌తో ప్రతిస్పందిస్తామన్న ఇరాన్

అమెరికా భూతల దాడులు, ఖర్గ్ ద్వీపం ఆక్రమణకు సంకేతాలు.. గల్ఫ్ షిప్పింగ్‌కు తీవ్ర అంతరాయం హెచ్చరిక
Iran Warns: ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు దిగే అవకాశాలు, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనంలోకి తీసుకునే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి బలమైన హెచ్చరిక వచ్చింది. తమ దేశ తీరం లేదా ద్వీపాలపై దాడి చేస్తే.. పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ (సముద్ర గన్నులు) పరచేస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ గట్టిగా హెచ్చరించింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
ఈ చర్యతో గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. తమ తీరం నుంచే ఈ సీమైన్స్‌ను జలాల్లోకి ప్రవేశపెట్టగలమని ఇరాన్ స్పష్టం చేసింది.
‘‘దాంతో సుదీర్ఘకాలం గల్ఫ్ ప్రాంతమంతటా.. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే ఉంటుంది. 1980ల్లో స్వల్ప సంఖ్యలో పరిచిన సీమైన్స్‌ను తొలగించడానికి 100 మైన్ స్వీపర్లు ప్రయత్నించి విఫలమైన సంగతిని మర్చిపోకూడదు’’ అని ఇరాన్ తన ప్రకటనలో శత్రు దేశాలకు గుర్తుచేసింది.
ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ఐలాండ్ అత్యంత కీలకమైనది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గ్‌ను ఆక్రమించాలని అమెరికా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా అమెరికా 4500 మంది సెయిలర్లు, మెరైన్లను మోహరించింది. హెలికాప్టర్లు, ఎఫ్-35 ఫైటర్ జెట్స్, సాయుధ ల్యాండింగ్ వెహికిల్స్‌తో కూడిన బెటాలియన్‌ను కూడా పంపింది. అయితే ఈ మోహరింపు హర్మూజ్‌ను తెరవడానికా లేక ఖర్గ్ స్వాధీనానికా అనే దానిపై స్పష్టత లేదు.

