Iran Warns: అమెరికా భూతల దాడికి దిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏ ప్రయత్నం చేసినా గట్టి స్పందన ఇస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.

ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం స్పష్టంగా ఉందని, దానిలో ఎలాంటి సందేహాలకు తావు లేదని బఘాయీ అన్నారు. చిన్న ఒప్పందమైనప్పటికీ అందులో 14 క్లాజులు ఉన్నాయని, హర్మూజ్ జలసంధి నిర్వహణ బాధ్యత ఇరాన్‌కు చెందుతుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఒమన్‌తో పాటు ప్రాంతీయ దేశాలతో చర్చించి ముందుకు తీసుకెళ్తామని పేక్కొన్నారు. ఒప్పందం నిబంధనలు స్పష్టంగా ఉన్నందున దాన్ని ఉల్లంఘించే అవకాశం అమెరికాకు లేదని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెలువడ్డాయి. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే సైనిక సామర్థ్యం అమెరికాకు ఉన్నప్పటికీ, దాన్ని ఎక్కువ కాలం ఆధీనంలో ఉంచుకోవడం సులభం కాదని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంది. బుషెహర్ ప్రావిన్స్ తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపంపై ఆక్రమణ జరిగితే ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంపాదించాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story