Araghchi: అమెరికా బెదిరింపులకు ఇరాన్ తలొగ్గదు.. SCO సదస్సులో అరాఘ్చీ స్పష్టం
అరాఘ్చీ స్పష్టం

Araghchi: అమెరికా తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ లొంగదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు.
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరగకపోవడానికి కారణం మార్గాలు లేకపోవడం కాదని, అమెరికా నిరంతరం ఉపయోగిస్తున్న బెదిరింపులు, బలవంతపు ఒత్తిళ్ల ధోరణే ప్రధాన సమస్య అని అరాఘ్చీ విమర్శించారు. “ఇరాన్ ప్రజల ప్రయోజనాలను, హోర్ముజ్ జలసంధిలో దేశ రక్షణను కాపాడుకోవడమే మా ప్రాథమిక సూత్రం. బెదిరింపులకు మేము భయపడేది లేదు” అని ఆయన తేల్చిచెప్పారు.
SCOను ప్రగతిశీల సంస్థగా అభివర్ణిస్తూ, అంతర్జాతీయ సంబంధాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాల ఏకపక్ష వైఖరిని సభ్య దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
దౌత్యపరమైన ప్రకటనలు వస్తుండగానే, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు పూర్తి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. బందర్ అబ్బాస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కనీసం ఇద్దరు గాయపడ్డారు. ఒమన్ సముద్రంలో ఒక LPG ట్యాంకర్‌పై అమెరికా రెండు మిస్సైళ్లతో దాడి చేసింది.
ప్రతిస్పందనగా ఇరాన్ ఆర్మీ ‘ఆపరేషన్ లైట్నింగ్’ పేరిట క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించింది. కువైట్‌లోని అలీ అల్-సేలం ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అల్-జుఫైర్ సైనిక స్థావరం, జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ఖాతామ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దొల్లాహి అమెరికాను హెచ్చరిస్తూ, “అమరుడైన ప్రతి ఇరాన్ పౌరుడికి బదులుగా ఒక అమెరికన్ సైనికుడిని లక్ష్యంగా చేసుకుంటాం” అని ప్రకటించారు.
దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు దౌత్య, సైనిక వర్గాలు ఏకతాటిపై పనిచేస్తున్నాయని ఇరాన్ పునరుద్ఘాటించింది.

