చర్చలకు ఫోన్ చేశారు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump’s Key Remarks: అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్న వేళ.. ఇరాన్ నాయకులు చర్చల కోసం తనకు ఫోన్ చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేతిలో దెబ్బలు తిని ఇరాన్‌కు విసుగు పట్టిందని, దేశ నాయకులు హింస ద్వారానే పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ నాయకులు నిన్న నాకు ఫోన్ చేశారు. మాతో చర్చలు జరపాలని వారు కోరారు. ఆ దేశం తన పరిమితులు దాటినట్లు కనిపిస్తోంది. అక్కడి నాయకులు కేవలం హింసతోనే దేశాన్ని పరిపాలిస్తున్నారు. మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. సమస్య పరిష్కారానికి బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇరాన్ నాయకులతో సమావేశం జరిగే ముందు చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. అయితే, వారితో ఒక సమావేశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.

ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనల అణచివేతపై ట్రంప్ మరింత తీవ్రంగా స్పందించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై తాను స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నట్లు తెలిపారు. శాటిలైట్ సేవల ద్వారా ఇరాన్‌లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే అవకాశాలను చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మృతుల సంఖ్య 544కు చేరింది

ఇరాన్‌లో నిరసనకారులపై భద్రతా బలగాల అణచివేత కొనసాగుతోంది. ఘర్షణల్లో మృతుల సంఖ్య 544కు చేరింది. వీరిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 10 వేల మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

భారతీయుల అరెస్ట్.. తప్పుడు వార్త

ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆరుగురు భారతీయులను అరెస్టు చేశారని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వార్తలు తప్పుడు వార్తలని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఆ ద్వీపాన్ని అమెరికా కొనుగోలు చేయకపోతే రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని, తాను అడ్డుకుంటానని, ఒప్పందం కుదరడం సులభమని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story