Iran: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను పక్కన పెట్టి భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్ మొత్తకి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఆక్రమించి, అక్కడి సైనికులను బంధించి ఇరాన్‌కు తీసుకురావాలని ఇరాన్ సైన్యానికి పిలుపునిచ్చారు. దీనికోసం భూతల దాడులు చేయాలని సూచించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని అంచనా వేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మనుచెహర్, అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ‘మోసపూరిత ప్రణాళిక’గా విమర్శించారు. ఇస్లామాబాద్ చర్చలు అమెరికా పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఇరాన్‌పై దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అమెరికా ఇరాన్ డ్రోన్, క్షిపణి నిల్వలు, హర్మూజ్ సమీప సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని సీజ్ చేస్తామని యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మనుచెహర్ వ్యాఖ్యలు గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story