అమెరికా దాడుల నుంచి రక్షణ కోసం పాక్ సహాయం? సంచలన ఆరోపణలు

Iranian Military Aircraft: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌పై తాజాగా సంచలనకరమైన ఆరోపణలు వెలువడ్డాయి. ఇటీవలి ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తన ఎయిర్‌బేస్‌లలో రహస్యంగా నిలిపి ఉంచడానికి పాకిస్థాన్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ నివేదికల ప్రకారం, ఇరాన్‌కు చెందిన అనేక సైనిక విమానాలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లో దాచి ఉంచబడ్డాయి. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానాలు, ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130 విమానాలు సహా పలు సైనిక ఆస్తులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక బలాలను రక్షించుకోవడానికి ఇరాన్ ఈ మార్గం అనుసరించినట్లు ఆ కథనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, టెహ్రాన్‌కు చెందిన ఒక పౌర విమానాన్ని అఫ్గానిస్థాన్‌లో కూడా నిలిపి ఉంచినట్లు వివరాలు వెల్లడయ్యాయి.

ఈ ఆరోపణలపై పాకిస్థాన్ సీనియర్ అధికారి ఒకరు తీవ్రంగా ఖండించారు. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ ప్రజావాసాలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఉందని, అక్కడ ఇలాంటి రహస్య కార్యకలాపాలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అఫ్గానిస్థాన్ పౌర విమానయాన అధికారులు మాత్రం, ఘర్షణలు మొదలు కాకముందే మహాన్ ఎయిర్‌కు చెందిన ఇరాన్ పౌర విమానం కాబుల్‌లో దిగిందని, ఇరాన్ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని తెలిపారు. తాలిబన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా అఫ్గాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను ఖండించారు.

ఈ అంశంపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా స్పందించారు. “ఇది నిజమైతే, యుద్ధ ముగింపు మధ్యవర్తిత్వంలో పాకిస్థాన్ పాత్రను పునఃపరిశీలించాల్సి ఉంటుంది” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఈ సంఘటనలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story