Strategist Ali Jafari: అమెరికాకు తలనొప్పిగా మారిన ఇరాన్ ‘మొజాయిక్ కవచం’ – ఎవరు ఈ వ్యూహకర్త అలీ జఫారీ?
ఎవరు ఈ వ్యూహకర్త అలీ జఫారీ?

Strategist Ali Jafari: దాదాపు 23 ఏళ్ల క్రితం ఇరాక్‌పై యుద్ధం చేసిన అమెరికా ఒక నెలలోనే సద్దాం హుస్సేన్ సైన్యాన్ని మట్టికరిపించింది. ఇప్పుడు ఇరాన్‌ను కూడా అదే విధంగా గెలవొచ్చన్న ధీమాతో ఇజ్రాయెల్‌తో కలిసి రణరంగంలోకి అడుగుపెట్టింది. తొలి రోజే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడంతో ఇరాన్ పతనం ఖాయమని భావించింది. కానీ, నాటి ఇరాక్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఒక మేధావి తన వ్యూహంతో అగ్రరాజ్యాన్ని నిలువరిస్తున్నాడు. అతడే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) మాజీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ. అగ్రనేతలను కోల్పోయినా ఇరాన్ దాదాపు రెండు వారాలుగా నిర్విరామంగా పోరాడుతోందంటే.. అందుకు కారణం జఫారీ సృష్టించిన ‘మొజాయిక్ కవచం’ రక్షణ వ్యూహమే!
ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న ‘డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్’ సిద్ధాంతం అత్యంత కీలకం. అధినాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా పట్టు వదలకుండా పోరాడగలిగేలా రూపొందించిన ఈ వ్యూహం జఫారీ కృషి. ముందే సిద్ధం చేసిన ప్రణాళికల ప్రకారం పాక్షిక-స్వతంత్ర విభాగాలకు అధికారాలు అప్పగించారు. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మహమ్మద్ పాక్పోర్, రక్షణ మంత్రి అజీజ్ నజీర్‌జాదే, సాయుధ బలగాల చీఫ్ వంటి టాప్ నేతలను కోల్పోయినా.. ఇరాన్ 13 రోజులుగా ధైర్యంగా ప్రతిఘటిస్తోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఈ వికేంద్రీకరణ వ్యూహాలను గట్టిగా సమర్థించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా అమెరికా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో చవిచూసిన పరాజయాలను మేం జాగ్రత్తగా అధ్యయనం చేశాం. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. మా రాజధానిపై బాంబులు వర్షించినా మా యుద్ధ సామర్థ్యాలు తగ్గవు. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ ముగించాలో.. ఈ డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ మాకు నేర్పించింది’’ అని అమెరికాను హెచ్చరించారు. ఈ వ్యూహంతో ఇరాన్‌ను ఓడించడం అంత సులభం కాదని పశ్చిమ దేశాలు కూడా గుర్తించడం మొదలయింది.
ఎవరీ జఫారీ?
ఇరాన్ మిలిటరీలో జఫారీ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో పని చేశారు. 1979-89 మధ్య ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొని అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్‌కు కమాండర్‌గా, 2005లో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’ను లోతుగా అధ్యయనం చేసి అందులోని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నారు.
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ చుట్టూ ఉన్న కేంద్రీకృత కమాండ్ వ్యవస్థను అమెరికా ధ్వంసం చేయగా.. ఆ దేశ సైన్యం, రిపబ్లికన్ గార్డ్‌ల మధ్య సమన్వయం దెబ్బతిని లొంగిపోయాయి. ఈ లోపాన్ని గమనించిన జఫారీ ‘మొజాయిక్ వ్యూహం’ను రూపొందించారు. 2007లో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని పూర్తిగా అమలు చేశారు.
ఈ వ్యూహంలో ఐఆర్‌జీసీని 31 సెమీ-ఆటానమస్ ప్రావిన్షియల్ కమాండ్స్‌గా విభజించారు. అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించారు. ప్రతి కమాండ్‌కు స్వతంత్ర హెడ్‌క్వార్టర్, కమాండ్ కంట్రోల్ నోడ్స్, క్షిపణులు, డ్రోన్లు వంటి అధునాతన ఆయుధ సమాహారాలు కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాలు లేకపోయినా.. వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చారు. ముందే రూపొందించిన ప్రణాళికల ప్రకారం చర్యలు తీసుకునే స్వేచ్ఛ కల్పించారు.
ఇప్పుడు ఇదే ‘మొజాయిక్ కవచం’ సిద్ధాంతాన్ని ఇరాన్ పక్కాగా అమలు చేసి అమెరికా దండును నిలువరిస్తోంది. ఇరాక్ ఓటమి చరిత్రను మళ్లీ పునరావృతం కాకుండా చేసిన జఫారీ వ్యూహం.. ఇరాన్ రక్షణకు కవచంగా మారింది!

