Iran’s Nuclear Secret: పికాక్స్ పర్వతంలో ఇరాన్ అణు రహస్యం.. వేలాది సెంట్రిఫ్యూజ్‌లు భూగర్భానికి!
వేలాది సెంట్రిఫ్యూజ్‌లు భూగర్భానికి!

Iran’s Nuclear Secret: అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు. ఇరాన్ తన అణు సామగ్రిని రక్షించుకోవడానికి కీలక చర్య చేపట్టింది.
ఇజ్రాయెల్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్ వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లను పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) వద్దకు తరలించి, భూమి లోతుల్లో భద్రపరచింది. ఈ చర్యతో వైమానిక దాడుల ద్వారా వాటిని ధ్వంసం చేయడం చాలా కష్టతరమవుతోంది.
2025 జూన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై 12 రోజుల పాటు తీవ్ర బాంబు దాడులు చేశాయి. ఆ తర్వాతే ఈ సెంట్రిఫ్యూజ్‌ల తరలింపు జరిగినట్లు సమాచారం వెల్లడైంది.
ఇరాన్ యురేనియం గ్యాస్‌ను నతాంజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ వంటి కేంద్రాల్లో సెంట్రిఫ్యూజ్‌ల సాయంతో శుద్ధి చేసింది. అయితే ఇంకా అది గ్యాస్ రూపంలోనే ఉంది. అణు బాంబు తయారీకి దాన్ని లోహ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇరాన్ వద్ద ఉన్నాయా లేవా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
పికాక్స్ పర్వతాల కింద రహస్య భూగర్భ సౌకర్యాల్లో ఇరాన్ తన అణు కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించిందని, దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

