Iran’s ‘Retaliation List’: ఇరాన్ 'ప్రతీకార జాబితా': ట్రంప్, నెతన్యాహు, మెలోనీతో సహా 13 మంది నేతలు లక్ష్యం
13 మంది నేతలు లక్ష్యం

Iran’s ‘Retaliation List’: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని ఒక స్థానిక మీడియా సంస్థ ఆసక్తికరమైన 'రివేంజ్ లిస్ట్'ను ప్రచురించింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వంటి ప్రముఖ నేతల పేర్లు ఉన్నాయి. ఇరాన్ స్థానిక మీడియా ఈ జాబితాను ప్రచురించడం అంతర్జాతీయంగా దృష్టి ఆకర్షించింది.
ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించారు. బాధ్యులైన వారందరూ ఫలితాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ హిట్ లిస్ట్ బయటపడింది. ఇందులో 13 మంది విదేశీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ హర్మూజ్ సముద్రంలో నౌకలపై ఇరాన్ దాడులు, అమెరికా ప్రతిదాడులు వంటి సంఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ జాబితా అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చినదా లేదా మీడియా స్వంతంగా ప్రచురించిందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నేపథ్యం:
ఇరాన్‌లోని హంషహ్రి వంటి మీడియా సంస్థలు ఈ జాబితాను గ్రాఫిక్స్‌తో ప్రచురించాయి. ఇందులో నేతల చిత్రాలు జైలు యూనిఫాంలో చూపించడం ద్వారా బలమైన సందేశం ఇవ్వడం జరిగింది. ఇరాన్ కొత్త నాయకత్వం ప్రతీకారం తప్పించుకోలేమని పునరుద్ఘాటించినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరతలో కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు మరిన్ని సంక్షోభాలకు దారితీయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

