
- ట్రంప్ పై ఆరోపణల పోస్టును డిలీట్ చేసిన మస్క్
- ఎప్ స్టిన్ ఫైల్స్ లో ట్రంప్ ఉన్నాడన్న మస్క్
- తాజాగా ఆ పోస్టు తొలగింపు
- కొన్నాళ్లుగా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం
- ఒకరిపై ఒకరు దూషణలతో చెలరేగారు
- ఇద్దరి మధ్య అమెరికా ఫండ్ మేనేజర్ సయోధ్య యత్నం?
- ట్రంప్ బ్రహ్మాస్త్రం ముందు మస్క్ తలొగ్గారా?
- సయోధ్య కుదురుస్తామంటూ రష్యా ముందుకు
- మస్క్ కావాలనుకుంటే రష్యాకు రావొచ్చని పిలుపు
- సయోధ్యకు స్టార్ లింక్ అనుమతులతో చెల్లు
మాటల తూటాలతో రెచ్చి పోతున్న ఇద్దరు మొనగాళ్లు రాజీకొస్తున్నారా? ట్రంప్ ను ఇరికిస్తానంటూ గంతులేసిన బిగ్ బిలియనీర్ ఎలన్ మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ ఉన్నాడంటూ చేసిన ఎక్స్ పోస్టును డిలీట్ చేశాడు.అంటే తన వైపు నుంచి రాజీ ప్రయత్నాలు ప్రారంభించినట్లేనా?అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్మన్ సూచన మేరకు ట్రంప్ తో చర్చలకు తాను రెడీ అన్నట్లుగా మస్క్ తన పోస్ట్ ను వెనక్కు తీసుకున్నారు.ఇలా విడిపోయి తగవులాడుకోడం కన్నా కలసి ఉంటే మనల్ని మించిన శక్తి మంతుడు లేడంటూ ఆక్మన్ మస్క్ కి క్లాస్ పీకినట్లుగా వార్తలొస్తున్నాయి.
పొలిటికో మీడియా కథనం ప్రకారం మస్క్ ను ట్రంప్ బహిరంగ వేదికలపై తూలనాడకుండా నివారించేలా వైట్ హౌస్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అంతకుముందు పొలిటికో మీడియా ట్రంప్ కు ఫోన్ చేసినప్పుడు మస్క్ తో ఘర్షణ గురించి అడిగితే బ్రహ్మాండంగా సాగుతోందంటూ ట్రంప్ బదులిచ్చారు.
ఇద్దరి మధ్యా మాటల యుద్ధం ముదిరినప్పుడు తాను లేకపోతే ట్రంప్ అన్న వ్యక్తి ఎన్నికల్లో గెలిచే వారే కాదని,సెనేట్ ను డెమోక్రాట్లు నడిపేవారని,రిపబ్లికన్ల సంఖ్య 51-49కి మధ్య ఉండేదని పోస్ట్ చేశారు.అంతకుముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఎలన్ మస్క్ తనకు వ్యతిరేకంగా మారడంపైతనకు కోపం లేదని , కానీ ఇదివరకే ఇలా బయటపడి ఉంటే బాగుండేదని బదులిచ్చారు.
మొత్తం మీద ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తారస్థాయికి చేరిపోయి ఒకరి పరువు ఒకరు బయటపెట్టుకున్నారు.మస్క్ ఒంటిరంగును ట్రంప్ అవహేళన చేస్తే అడ్డగోలు సంపాదననంతా ఒక పోర్న్ స్టార్ కు ధారపోశాడంటూ ట్రంప్ ను తూలనాడారు మస్క్. ట్రంప్ అసలు పదవికే అర్హుడు కాడనీ, అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందనీ కామెంట్ చేశారు. తాజాగా మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారన్న కథనాలూ వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో తన ఆరోపణలపై వెనక్కి తగ్గడమంటే ట్రంప్ తో రాజీకి ప్రయత్నాలని అనుకోవాలా? లేక కొత్త పార్టీ పెడితే తన ఇమేజ్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడటమా? లేక ట్రంప్ ఇమ్మిగ్రేషన్ కొరడా ఝళిపిస్తే ఇబ్బందులు పడే ఓపిక లేక ఇలా వెనక్కి తగ్గారనుకోవాలా?
సయోధ్యకి రష్యా చొరవ
మరోవైపు రష్యా ఈ గొడవసద్దుమణిగేలా చొరవకు ప్రయత్నిస్తోంది.ఇద్దరూ కోరితే ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తానంటూ రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వదేవ్ ప్రతిపాదించారు.శాంతి ఒప్పందానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అయితే దీనికి కొంత ఫీజు కూడా చెల్లించాలంటూ మెలిక పెట్టారు. అందుకు కావాలంటే తాము స్టార్ లింక్ సర్వీసు ను అనుమతిస్తామని దానినే పేమెంట్ గా భావించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. దీనికి జవాబుగా టెస్లా సిఈఓ ఎలన్ మస్క్ లాఫింగ్ ఎమోజీ పోస్ట్ చేశారు.
మస్క్ కావాలనుకుంటే రష్యా ఆశ్రయం కల్పిస్తుందని కూడా మెద్వదేవ్ అన్నారు.మస్క్ కు అంత అవసరం పడదని,ఆయన చాలా ముందు చూపుతోనే ఒక రాజకీయ క్రీడ్ ప్రారంభించాడంటూ రష్యా న్యాయశాఖా మంత్రి డిమిత్రి నివికోవ్ అన్నారు. అంతగా అవసరం పడితే తమదేశానికి రావొచ్చన్నారు. ఈ సమయంలో డెమోక్రాట్లు అధికారంలోకి రావడం అనేది కల్ల అని అది మస్క్ కోరిక కూడా కాదన్న విషయం స్పష్టమవుతోందన్నారు.
