Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: ట్రంప్ హెచ్చరికలతో హమాస్ దిగొచ్చింది!
ట్రంప్ హెచ్చరికలతో హమాస్ దిగొచ్చింది!

బందీల విడుదలకు హమాస్ అంగీకారం.. గాజాపై బాంబు దాడులు ఆపాలని ట్రంప్ సూచన
Israel-Hamas War: ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య చాలా కాలంగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికను సూచించారు. దీన్ని ఒప్పుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపులకు హమాస్ దిగొచ్చి, ట్రంప్ ప్రణాళికలోని కొన్ని కీలక అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది.
ట్రంప్ ప్రతిపాదన ప్రకారం, తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధమని హమాస్ తెలిపింది. అయితే, కొన్ని విషయాలపై మరిన్ని చర్చలు జరపాలని పేర్కొంది. ఈ చర్చలను తక్షణమే ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. అంతేకాకుండా, గాజా పాలనను స్వతంత్ర పాలస్తీనా సాంకేతిక నిపుణుల సంస్థకు అప్పగించడానికి కూడా అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు, అలాగే అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వాముల సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.
గాజాపై దాడులు తక్షణమే ఆపండి
హమాస్ బందీల విడుదలకు అంగీకరించిన నేపథ్యంలో, ఇజ్రాయెల్‌కు ట్రంప్ ముఖ్యమైన సూచనలు చేశారు. గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘హమాస్ ప్రకటన ఆధారంగా, వారు శాశ్వత శాంతికి సిద్ధమని నమ్ముతున్నాను. ఇజ్రాయెల్ గాజాపై దాడులను ఆపితే, బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం దాడులు చేయడం ప్రమాదకరం’ అని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ సూచనలను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగింపు, ఖైదీల మార్పిడి, గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికుల ఉపసంహరణ వంటి అంశాలపై తక్షణ చర్చలకు సిద్ధమని తెలిపింది. హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ట్రంప్ ప్రణాళికలోని మొదటి దశను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ 20 సూత్రాలతో కూడిన ఫార్ములాను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్ దీన్ని అంగీకరించింది. హమాస్‌కు ఆదివారం వరకు గడువు ఇచ్చారు. ఒప్పందం కుదరకపోతే నరకం చూపిస్తానని హెచ్చరించారు. దీంతో హమాస్ అంగీకరించింది. ఒప్పందం ప్రకారం, 72 గంటల్లో హమాస్ బందీలందరినీ, ఇజ్రాయెల్ 250 మంది ఖైదీలను విడుదల చేయాలి. గాజా పాలనలో హమాస్‌కు స్థానం ఉండదు. దాని ఆయుధాలు, సొరంగాలను ధ్వంసం చేయాలి.
