ఇజ్రాయెల్‌కు మార్చాలని ఇజ్రాయెల్ ప్రణాళిక!

Israel: పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఆ ప్రాంతాల్లోని అమెరికా బేసులను తన భూభాగంలోకి తరలించుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రణాళిక అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్-12 తెలిపింది.

ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను మార్చడం ఇజ్రాయెల్‌కు బంగారు అవకాశంగా కనిపిస్తోంది. ఇటీవలి యుద్ధంలో అమెరికా దళాలతో కలిసి ఇజ్రాయెల్ బలగాలు కలిసి పోరాడాయి. రెండు దేశాల మధ్య ఆపరేషనల్, ఇంటెలిజెన్స్ బంధం బలంగా ఉంది. స్థావరాలు ఇజ్రాయెల్‌కు వచ్చేస్తే అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా బలం చేకూరుతుందని అంచనా.

ఖతార్‌లోని అల్ ఉదైద్ బేస్, బహ్రెయిన్‌లోని ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, యూఏఈలోని అల్ దఫ్రా బేస్ వంటి ముఖ్యమైన స్థావరాలు ఇకపై ఇజ్రాయెల్‌కు మారే అవకాశం ఉంది. అమెరికా దళాలు ఇక్కడికి వచ్చేస్తే లాజిస్టిక్స్ హబ్‌గా, యుద్ధ సరుకుల నిల్వ కేంద్రాలుగా, ఆయుధ డిపోలుగా ఇవి ఇజ్రాయెల్‌కు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన థాడ్, పేట్రియాట్, లేజర్ ఇంటర్‌సెప్టర్లు, ఇంటెలిజెన్స్ సామగ్రి వంటి అత్యాధునిక వ్యవస్థలను కూడా పంచుకోవడం సాధ్యమవుతుంది.

ఇంతకీ, ఈ మార్పుకు కారణం ఇరాన్ దాడులే. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం చేసిన దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా విమానం ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ తీవ్రంగా ధ్వంసమైంది. అమెరికా, దాని మిత్రదేశాల బలగాలకు ‘కళ్లు-చెవులు’లాంటి ఈ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) విమానం పని చేసేది. దీనిలోని అత్యున్నత రాడార్ వ్యవస్థ వందల కిలోమీటర్ల దూరం నుంచి విమానాలు, క్షిపణుల కదలికలను గుర్తించగలదు. దీన్ని కోల్పోవడం అమెరికాకు తీవ్ర ఎదురుదెబ్బ. ఇంతకు ముందు ఖతార్‌లోని అతి శక్తివంతమైన రాడార్ కేంద్రం కూడా ఇరాన్ దాడిలో పూర్తిగా నాశనమైంది.

ఈ నేపథ్యంలో అమెరికా స్థావరాలను ఇజ్రాయెల్ భూభాగంలోకి తరలించడం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని, భవిష్యత్ యుద్ధాల్లో మరింత ఎఫెక్టివ్‌గా పని చేయడానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story