అమెరికా చేరుకున్న నెతన్యాహు

Israeli Prime Minister Benjamin Netanyahu: ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్లారు. అయితే, సాధారణ మార్గంలో కాకుండా చుట్టూ తిరిగి ప్రత్యామ్నాయ మార్గంలో ఆయన విమానం ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. అరెస్టు భయంతోనే నెతన్యాహు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారని చర్చ జరుగుతోంది.

సాధారణంగా ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాలు మధ్య ఐరోపా గగనతలం మీదుగా ప్రయాణిస్తాయి. కానీ, నెతన్యాహు ప్రయాణించిన 'వింగ్స్ ఆఫ్ జియాన్' విమానం ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించింది. గ్రీస్, ఇటలీ శివారు ప్రాంతాల పైనుంచి మధ్యధరా సముద్రాన్ని దాటి, జిబ్రాల్టర్ జలసంధి మీదుగా అట్లాంటిక్ మహాసముద్రం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ మార్గం వల్ల ప్రయాణ దూరం, సమయం రెండూ పెరిగాయని విమానయాన నిపుణులు చెబుతున్నారు. సాధారణ మార్గం కంటే 373 మైళ్లు అధిక దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది.

గాజాపై యుద్ధం నేపథ్యంలో నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై 2024 నవంబర్‌లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ICC సభ్య దేశాల్లోకి అడుగుపెట్టినట్లయితే వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఐరోపాలోని చాలా దేశాలు ICC సభ్యులుగా ఉన్నాయి. గతంలో ఐర్లాండ్, నెతన్యాహు తమ దేశంలోకి వచ్చినట్లయితే అరెస్టు చేస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్ మాత్రం అరెస్టు చేయబోమని, ఇటలీ ఆలోచిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో నెతన్యాహు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.

ఐరాస సమావేశాల్లో నెతన్యాహు శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రసంగించనున్నారు. అనంతరం వాషింగ్టన్‌కు వెళ్లి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story