Jeffrey Epstein Case: ఎప్‌స్టీన్ లైంగిక నేరాల కేసు: బ్యాంక్ ఆఫ్ అమెరికా రూ.687 కోట్ల సెటిల్‌మెంట్‌కు అంగీకారం
బ్యాంక్ ఆఫ్ అమెరికా రూ.687 కోట్ల సెటిల్‌మెంట్‌కు అంగీకారం

Jeffrey Epstein Case: లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సాయం అందించారని ఆరోపిస్తూ ఒక మహిళ వేసిన దావాను సెటిల్‌మెంట్ చేసుకోవడానికి అమెరికాలోని రెండో అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ అమెరికా సమ్మతించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆ మహిళకు రూ.687 కోట్లు చెల్లించాలని బ్యాంకు నిర్ణయించింది.
ఎప్‌స్టీన్ బాధితుల తరఫున అక్టోబరు నెలలో ఈ మహిళ బ్యాంక్ ఆఫ్ అమెరికాపై యూఎస్ కోర్టులో దావా వేసింది. ఎప్‌స్టీన్ నేరాల గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ బ్యాంకు లాభాలకు ప్రాధాన్యం ఇచ్చి బాధితులను రక్షించడంలో నిర్లక్ష్యం వహించిందని ఆమె ఆరోపించింది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కూడా బ్యాంకు పట్టించుకోలేదని ఆమె తెలిపింది.
అయితే బ్యాంకు ఈ ఆరోపణలను ఖండించింది. తమ బ్యాంకు సాధారణ సేవలు అందించిన వ్యక్తులకు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న విషయం తమకు తెలియదని స్పష్టం చేసింది. జనవరి నెలలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జెడ్ రకాఫ్ ఈ దావా విచారణ చేపట్టిన సందర్భంగా బ్యాంకు ఉద్దేశపూర్వకంగానే ఎప్‌స్టీన్‌కు సాయం అందించిందని జడ్జి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో దావాను రూ.687 కోట్లకు సెటిల్‌మెంట్ చేసుకోవాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకు మరియు మహిళ తరఫు న్యాయవాదులు ఈ విషయాన్ని జడ్జి రకాఫ్‌కు అధికారికంగా తెలియజేశారు. అయినప్పటికీ ఎప్‌స్టీన్ లైంగిక అక్రమ రవాణా నేరాలకు తాము ఎలాంటి సహకారం అందించలేదని బ్యాంకు ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఈ దావాను సెటిల్ చేసుకుని విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఎప్‌స్టీన్ బాధితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపిన విషయాల ప్రకారం ఈ సెటిల్‌మెంట్ తమ క్లయింట్‌లకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని జడ్జి అంగీకరించాల్సి ఉంది. వచ్చే గురువారం న్యాయమూర్తి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

