K. P. Sharma Oli Arrested: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

K. P. Sharma Oli Arrested: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టయ్యారు. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ‘జెన్ జెడ్’ (యువత) నిరసనలను హింసాత్మకంగా అణచివేయడంలో పాత్ర పోషించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకోవడం గమనార్హం. నేపాల్‌లో కొత్త ప్రధాని బాలేంద్ర షా (బాలెన్) ప్రమాణం చేసిన మరుసటి రోజే ఓలీని అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
భక్తపుర్‌లోని తన నివాసం నుంచి పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. కొత్త హోం వ్యవహారాల శాఖ మంత్రి సుడాన్ గురంగ్ సోషల్ మీడియా ద్వారా ఈ అరెస్టును ధృవీకరించారు. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌లను అదుపులోకి తీసుకున్నాం. ఇది ప్రతీకార చర్య కాదు... న్యాయ ప్రక్రియకు మొదలు మాత్రమే” అని ఆయన రాశారు.
పోలీసులు తీసుకెళ్తుండగా ఓలీ మీడియాతో మాట్లాడుతూ ఈ అరెస్టును కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన్ను కఠమండు లోని ఒక క్లినిక్‌లో ప్రాథమిక వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో మొదలైన ఉద్యమం త్వరలో అవినీతికి వ్యతిరేక ‘జెన్ జెడ్’ ఆందోళనలుగా మారింది. ఈ నిరసనల సమయంలో జరిగిన ఘర్షణల్లో 70 మందికి పైగా మరణించగా, వారిలో 19 మంది యువకులు ఉన్నారు. ఈ హింసాత్మక అణచివేతకు మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి బాధ్యత వహించాలని ఆరోపణలు ఉన్నాయి.
ఈ అరెస్టు నేపాల్ రాజకీయాల్లో కొత్త మలుపును సూచిస్తోంది. కొత్త ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

