Key Changes in H-1B Visa Lottery: హెచ్-1బీ వీసా లాటరీలో కీలక మార్పులు.. అధిక వేతనాలకే ప్రాధాన్యం!
అధిక వేతనాలకే ప్రాధాన్యం!

Key Changes in H-1B Visa Lottery: అమెరికాలో వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు ర్యాండమ్ లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తుండగా.. ఇకపై వేతన స్థాయి, నైపుణ్యాల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్‌ఎస్) ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రకటించింది. ఈ నూతన విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వచ్చి, 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్‌కు వర్తిస్తుంది.
కొత్త నియమాల ప్రకారం.. అత్యధిక వేతనాలు పొందే, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణులకు వీసా లభించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. తక్కువ జీతాలు లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు మాత్రం ఛాన్స్‌లు తగ్గనున్నాయి. ఇది అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను రక్షించేందుకు ఉద్దేశించిన చర్యగా అధికారులు తెలిపారు.
లాటరీలో వచ్చే మార్పులివీ..
అమెరికా కార్మిక శాఖ వేతనాలను నాలుగు స్థాయిలుగా విభజించింది:
లెవల్-1 (ఎంట్రీ లెవల్): ఇప్పటిలాగే ర్యాండమ్ లాటరీ. ఒక్కసారి మాత్రమే ఎంట్రీ. వీసా ఛాన్స్ గతంతో పోలిస్తే 15 శాతం తగ్గనుంది.
లెవల్-2: రెండు సార్లు లాటరీలో ప్రవేశం. ఎంపిక అవకాశం 31 శాతం.
లెవల్-3: మూడు సార్లు ఎంట్రీ. ఛాన్స్ 46 శాతం.
లెవల్-4 (అత్యధిక నైపుణ్యం, వేతనం): నాలుగు సార్లు లాటరీలో అవకాశం. వీసా లభించే ఛాన్స్ 61 శాతం.
ఈ మార్పులతో అమెరికాలో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యమని యూఎస్‌సీఐఎస్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎంట్రీ లెవల్ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు.
భారతీయ వలసదారులకు హెచ్చరిక..
ఇదిలాఉండగా, అమెరికా కఠిన వీసా నిబంధనలతో భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతర చెక్‌లతో హెచ్-1బీ, హెచ్-4 వీసా అపాయింట్‌మెంట్లు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా ఎంబసీ.. చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలను అడ్డుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
ఈ మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కానీ విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది.

