King Charles: లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తన తమ్ముడు ప్రిన్స్‌ ఆండ్రూ సంబంధాల వల్ల బ్రిటిష్ రాజకుటుంబం అపఖ్యాతి పాలైంది. దీంతో రాజకుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మరింత పారదర్శకత కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ తన వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపు వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించారు.

గురువారం బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి విడుదలైన సాధికారిక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. బ్రిటన్ చరిత్రలో ఇలాంటి చర్య తీసుకున్న మొదటి రాజు కింగ్ చార్లెస్ అవుతారు. ప్రజల పన్నుల ద్వారా రాజకుటుంబానికి నిధులు సమకూర్చే ‘సావరిన్ గ్రాంట్’ విధానంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ వార్షిక సమావేశంలో రాజు పన్ను సమాచారాన్ని విడుదల చేయనున్నారు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్నప్పుడు చార్లెస్ తన వ్యక్తిగత ఆదాయపన్ను వివరాలు విడుదల చేశారు. అయితే 2022లో తన తల్లి రాణి ఎలిజబెత్ మరణించి సింహాసనం అధిష్ఠించాక ఇది మొదటిసారి. ప్రస్తుత ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం కూడా తండ్రి చార్లెస్ మార్గంలోనే నడుస్తారని భావిస్తున్నారు.

రాజుకు కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, చార్లెస్ తన ప్రైవేటు ఆదాయంపై స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తున్నారు. ఎప్‌స్టీన్ వ్యవహారంతో ప్రిన్స్ ఆండ్రూ 2025లో యువరాజు హోదా కోల్పోయి, మౌంట్‌బాటన్-విండ్‌సర్ పేరుతో వ్యవహరించాల్సి వచ్చింది. అతడు పెద్ద రాజభవనాన్ని కూడా ఖాళీ చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజు ఆర్థిక పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story