Vance Family: వాన్స్ కుటుంబం చివరి నిమిషాల ప్రయాణ మార్పులు.. సీక్రెట్ సర్వీస్‌కు తీవ్ర అసంతృప్తి
సీక్రెట్ సర్వీస్‌కు తీవ్ర అసంతృప్తి

Vance Family: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన షెడ్యూళ్లను ఆఖరి నిమిషంలో తరచూ మార్చడంతో ఆయన కుటుంబ భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో వాన్స్ తన చిన్న కుమారుడిని గోల్ఫ్ శిక్షణకు తీసుకెళ్లాలని ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఉపయోగించాలని కోరిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయాణం జరగలేదు. ఇలాంటి ప్రయాణాలకు వైట్ హౌస్ మిలిటరీ కార్యాలయం అనుమతి తప్పనిసరి.
హెలికాప్టర్ ఉపయోగం ద్వారా గంటకు 16,000 నుంచి 24,600 డాలర్ల వరకు ప్రజాధనం ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వ హెలికాప్టర్లను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడానికి నిషేధం లేనప్పటికీ, గోల్ఫ్ శిక్షణ వంటి కార్యక్రమాలకు అధికారిక హెలికాప్టర్ కోరడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వర్జీనియాలో కొత్త ఇల్లు వెతికే సమయంలో కూడా పలుమార్లు హెలికాప్టర్ ప్రయాణాలు చేశారని సమాచారం. ముందస్తు నోటీసు లేకుండా షెడ్యూళ్లు మార్చడం వల్ల భద్రతా సిబ్బందిపై భారీ ఒత్తిడి పెరుగుతోందని వార్తలు తెలిపాయి.
అయితే వాన్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది సేవలను ప్రశంసించిన వాన్స్ ఆఫీసు, కుటుంబంతో పాటు ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న విషయమని, అయినప్పటికీ సిబ్బంది అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొంది.
ఈ సంఘటనలు అమెరికా ఉపాధ్యక్షుడి కార్యకలాపాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజాధన వినియోగం అనే అంశాలపై మళ్లీ చర్చను రేపుతున్నాయి.

