Learjet Crash: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక ప్రైవేట్ జెట్ విమానం ఆదివారం నేలకు కూలిపోయి అందులో ప్రయాణిస్తున్న 9 మంది మరణించారు. టెక్సాస్ నుంచి బహామాస్‌కు వెళ్తున్న లియర్‌జెట్ 60 విమానం పామ్ బీచ్ కౌంటీలో కూలిపోయింది.


విమానం తీవ్రంగా క్రిందికి పడుతున్నప్పుడు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు మేడే కాల్ చేశారు. విమానం నిమిషానికి 20,000 అడుగుల వేగంతో క్రిందికి పడుతున్నట్లు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే విమానం నోస్‌డైవ్‌తో నేలకు కూలి పేలుడు జరిగింది. అందరూ మరణించినట్లు రవాణా కార్యదర్శి సీన్ డఫీ నిర్ధారించారు.


ఈ విమానం ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్‌లోని నార్త్ ఎల్యుథెరా విమానాశ్రయానికి వెళ్తోంది. పామ్ బీచ్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని ఒక రోడ్డు పక్కన ఉన్న నివాస ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలోని ట్రైలర్ హోమ్స్ కమ్యూనిటీ నుంచి 600 మంది నివాసితులను ఖాళీ చేయించారు.

వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను షెల్టర్లకు తరలించారు. విమానం కూలిపోయినప్పుడు ఎగిరిన శకలాలు ఇళ్లపై పడ్డాయని, చిన్న చిన్న మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ప్రమాద ప్రాంతాన్ని క్రైమ్ సీన్‌గా ప్రకటించి అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికుల వివరాలు ఇంకా అందుబాటులో లేవు.

Next Story