వెంటనే అమలులోకి!

US Visa Rules: అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేస్తున్న భారతీయులకు కొత్త నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి. నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాల (NIV) కోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా చట్టబద్ధ రెసిడెన్సీ ఉన్న దేశంలోనే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంది.

ఈ నియమం వల్ల భారతీయ వ్యాపారులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. బీ1 (వ్యాపార), బీ2 (టూరిస్ట్‌) వీసాలను స్వల్ప వ్యవధిలో పొందడం కష్టతరం కానుంది. గతంలో వీసా ఇంటర్వ్యూల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. కొవిడ్‌-19 సమయంలో వీసా జారీలో జాప్యం జరిగినట్లే, ఈ కొత్త నిబంధనలతో మళ్లీ ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌, ముంబయిలో బీ1, బీ2 వీసా ఇంటర్వ్యూల కోసం 3.5 నెలలు, దిల్లీలో 4 నెలలు, కోల్‌కత్తాలో 5 నెలలు, చెన్నైలో 9 నెలల సమయం పడుతోంది. గతంలో భారతీయులు జర్మనీ, సింగపూర్‌, బ్యాంకాక్‌ వంటి దేశాలకు వెళ్లి ఇంటర్వ్యూలు షెడ్యూల్‌ చేసుకునేవారు. రెండేళ్ల క్రితం ఫ్రాంక్‌ఫర్ట్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించింది. హెచ్‌-1బీ వీసాదారులు బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌లకు కూడా వెళ్లారు.

నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాలు వ్యాపారం, పర్యాటకం, విద్య, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులతో వివాహం వంటి అవసరాల కోసం జారీ చేస్తారు. కొత్త నిబంధనల వల్ల వీసా జారీలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో భారత విద్యార్థులు ఇతర దేశాలపై దృష్టి సారిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story