చెల్లెళ్లు సాదియా, సమైరా నేతృత్వం

Masood Azhar: భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో జైష్‌-ఇ-మహమ్మద్‌కు చేసిన దెబ్బ తిరిగి ప్రతీకారంగా ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జైష్‌-ఇ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళలను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ జిహాద్ కోర్సులు (Online Jihadi Course) ప్రారంభించనున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ కోర్సుకు ‘తౌఫత్ అల్ ముమినాత్’ అని పేరు పెట్టినట్లు సమాచారం. జైష్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెళ్లు సాదియా అజర్, సమైరా అజర్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ బహవల్‌పూర్‌లోని జైష్ కేంద్రంపై భారత వైమానిక దళం జరిపిన దాడిలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. వారిలో సాదియా భర్త యూసఫ్ అజర్, మసూద్ బావ కూడా ఉన్నారు. అంతేకాకుండా, సమైరా భర్త పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూక్ గతంలో భారత భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు చెల్లెళ్లు మహిళా బ్రిగేడ్ సభ్యులకు ఆన్‌లైన్‌లో మతపరమైన, జిహాద్ సంబంధిత పాఠాలు బోధిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇతర మహిళలను ఉగ్రవాద రంగంలో చేర్చుకోవడానికి ఈ బ్రిగేడ్ సభ్యులు చురుకుగా పనిచేస్తున్నారు.

ఈ మహిళా బ్రిగేడ్‌లో జైష్ కమాండర్ల భార్యలతో పాటు బహవల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 8 నుంచి ఈ కోర్సు సెషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 40 నిమిషాల పాటు మసూద్ చెల్లెళ్లు, కమాండర్ల కుటుంబ సభ్యులు పాఠాలు చెప్పనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా బ్రిగేడ్ సభ్యుల నుంచి చిన్న మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈ కొత్త మహిళా బ్రిగేడ్ భారత్‌లో తమ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జమ్మూ కాశ్మీర్, యూపీ వంటి ప్రాంతాల్లో మహిళలను ఆకర్షించే ప్రమాదం ఉందని, దీనిపై భారత అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story