Massive ‘Money Heist’ in Pakistan: పాక్‌లో భారీ 'మనీ హైస్ట్'.. కరాచీలో 300 మిలియన్ పాక్ రూపాయల బంగారు-ఆభరణాలు మాయం
పాక్ రూపాయల బంగారు-ఆభరణాలు మాయం

Massive ‘Money Heist’ in Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద చోరీల్లో ఒకటిగా నిలిచింది ఓ ఆభరణాల దుకాణంపై దుండగుల దాడి. వీకెండ్ సెలవుల సమయంలో దుకాణం మూసి ఉండగా, తెలియని దొంగలు గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి సుమారు 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల (PKR) విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకుని అంతర్ధానమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని పాకిస్థాన్ కాలనీ (మలిర్) ప్రాంతంలోని ఓ ప్రముఖ ఆభరణాల దుకాణం గత రెండు రోజులుగా మూసివేయబడి ఉంది. ఆదివారం ఉదయం సిబ్బంది దుకాణానికి వచ్చి తలుపులు, లాక్‌లు సరిగ్గా ఉన్నట్లు కనిపించినా లోపల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల దర్యాప్తులో.. దుకాణం వెనుక గోడకు రంధ్రం (టన్నెల్) చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు తేలింది. దాదాపు 700 తులాల బంగారు కడ్డీలు (గోల్డ్ బార్స్), స్వర్ణాభరణాలు, వజ్రాలు, కస్టమర్ల ఆభరణాలతో సహా మొత్తం PKR 300 మిలియన్ల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదు ప్రకారం ఈ చోరీ జరిగింది.
ఈ మార్కెట్ ప్రాంతంపై దొంగలకు పూర్తి సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది కరాచీ చరిత్రలోనే అతిపెద్ద ఆభరణాల దోపిడీల్లో ఒకటిగా నిలిచింది.
పోలీసులు దుండగులను గుర్తించి, దోచుకున్న వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

