ట్రంప్ మరోసారి హెచ్చరిక

Trump Issues Fresh Warning: ఇరాన్‌లో నిరసనకారులపై అణచివేత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైనిక చర్యకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నప్పటికీ, ఆ దేశంలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ పాలకులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ చుట్టూ ఇప్పటికే భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు ఎలాంటి నష్టం జరగకూడదని తాను కోరుకుంటున్నప్పటికీ, ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. అధ్యక్ష భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌లో వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి వల్ల రద్దు చేశారని ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను జోక్యం చేసుకోకపోతే 800 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయేవారని, తన హెచ్చరికల వల్లే ఇరాన్ పాలకులు వెనక్కి తగ్గారని తెలిపారు. వారిని ఉరితీస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతోనే ఆ నిర్ణయం మార్చారని ఆయన వివరించారు.

మరోవైపు, రాబోయే రోజుల్లో అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌకతో పాటు ఇతర సైనిక దళాలు పశ్చిమ ఆసియాకు చేరుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సహా పలు యుద్ధనౌకలు ముందుకు కదిలాయి. వీటితోపాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పశ్చిమాసియాకు పంపే చర్యలు చేపట్టినట్లు వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండాలని ట్రంప్ ఆశించినప్పటికీ, అవసరమైతే దృఢమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్ పాలకులు నిరసనలను అణచివేతకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా వైపు నుంచి పదేపదే హెచ్చరికలు వస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story