Fake Kidnapping Plot by Mayor: మెక్సికోలోని ఓ మేయర్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి తన కిడ్నాప్‌ను డ్రామాగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

టెనాన్సింగో పట్టణ మేయర్ నాన్సీ నాపొలిస్‌పై ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొందరు సాయుధులు ఆమెను తుపాకులతో బెదిరించి బలవంతంగా అపహరించారని వార్తలు వచ్చాయి. కిడ్నాపర్లు ఆమె విడుదలకు 2.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే మేయర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు.

ఒక వ్యక్తి సమాచారం మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టి, కిడ్నాపర్ల నుంచి ఆమెను రక్షించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో ఇది నాటకమని దర్యాప్తు అధికారులు అనుమానించారు.

ప్రాసిక్యూటర్ల ప్రకారం, నాపొలిస్ విడుదలకు ప్రైవేట్ నిధులు సమకూరకపోతే ప్రభుత్వ డబ్బును వాడాలని ఆమె బంధువులు సూచించారని ఆరోపించారు. ఇప్పటికి ఆమెపై అరెస్టు వారెంట్ జారీ కాలేదు. అయితే ఆమె భర్త, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 9న ఆమెను విచారించేందుకు కోర్టు అనుమతి కోరారు.

అయితే ఈ ఆరోపణలను నాన్సీ నాపొలిస్ ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపితమని, అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి తెలిపారు.

ఈ ఘటన మెక్సికోలో తీవ్ర చర్చనీయాంశమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story