White House: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్యలు కూడా పరిశీలనలో: వైట్‌హౌస్
సైనిక చర్యలు కూడా పరిశీలనలో: వైట్‌హౌస్

White House: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇది తమ జాతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ ద్వీపాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని, అందులో సైనిక బలాన్ని ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
గ్రీన్‌లాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రత్యర్థి దేశాలను అడ్డుకోవడానికి దానిపై పూర్తి నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు. ఈ లక్ష్య సాధనకు అందుబాటులోని అన్ని ఎంపికలను తన టీమ్‌కు పరిశీలించాలని ట్రంప్ సూచించినట్లు చెప్పారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను సైనిక ఆపరేషన్‌తో అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్రీన్‌లాండ్ అంశం వార్తల్లో నిలుస్తోంది. మరో 20 రోజుల్లో ఈ విషయంపై మాట్లాడదామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ ‘త్వరలో’ అని పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీంతో అమెరికా ఈ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన, ఖనిజ సంపదతో నిండిన ఈ ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి స్థానికులకే ఉంటుందని అవి మద్దతు తెలుపుతున్నాయి.

