మొజ్తబా ఖమేనీ ఎన్నిక!

Supreme Leader of Iran: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో దేశ నాయకత్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (నిపుణుల సభ)లోని కీలక నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరాన్ ఇంటర్నేషనల్ వంటి మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. మొజ్తబా ఖమేనీకి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంగా IRGC తీవ్ర ఒత్తిడి తెచ్చి మొజ్తబానే ఎన్నుకోవాలని సభ్యులపై ప్రభావం చూపినట్లు సమాచారం.

మొజ్తబా ఖమేనీ (56) ఖమేనీ రెండో కుమారుడు. ఆయన మధ్యస్థ షియా మతపండితుడిగా పేరుపొందారు. చిన్నతనం నుంచి మత విద్య అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో IRGCలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పదవి చేపట్టకపోయినా, తండ్రి ఖమేనీకి సన్నిహితంగా ఉండి వెనుక నుంచి ప్రభావం చూపుతున్నారని చెబుతారు.

అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇరాన్‌లో వారసత్వ రాజకీయాలకు దారితీస్తుందని, 1979 ఇస్లామిక్ విప్లవ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు యుద్ధ పరిస్థితుల్లో దేశ స్థిరత్వం కోసం హార్డ్‌లైనర్‌ను ఎన్నుకోవడం అనివార్యమైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వం దేశ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story