Mojtaba Khamenei : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం సుదీర్ఘ చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అందుబాటులో లేకపోవడమేనని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం రహస్య ప్రదేశంలో దాక్కుని ఉన్నాడని, కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు సందేశాలు పంపుతున్నాడని వారు వెల్లడించారు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం, ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌ను ఖమేనీ చూశాడని సమాచారం అందింది. అయితే, దానిపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇరాన్ సీనియర్ అధికారులు కూడా ఆయనను నేరుగా సంప్రదించలేకపోతున్నారు.

ఖమేనీతో పాటు టెహ్రాన్‌లోని పలువురు సీనియర్ నాయకులు కూడా వారాల తరబడి బంకర్లలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. వారు నేరుగా కలుసుకోవడం లేదని సమాచారం.

నేపథ్యం:

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన మొదటి రోజే మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేశారు. ఆ తర్వాత అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేశారు. అయితే, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం ఆ వార్తలను తోసిపుచ్చింది.

అయినప్పటికీ, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు లేదా ప్రసంగించలేదు. ఇజ్రాయెల్ మాత్రం ఖమేనీ హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా తమ లక్ష్యంలోనే ఉంటాడని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఈ నేపథ్యంలో మొజ్తాబా ఖమేనీ రహస్య స్థావరంలో ఉన్నట్లు వచ్చిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story