అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రలు చేస్తోందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌కు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంపే నంబర్‌ వన్‌ శత్రువని, అందుకే ఆయనను చంపాలని టెహ్రాన్‌లో కుట్రలు జరుగుతున్నాయన్నారు.

వాస్తవానికి ఇప్పటికే.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. యుద్ధాలు, దాడులు ఆపాలని అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తులు చేస్తున్నా ఈ ఇరు దేశాలూ పట్టువిడవడం లేదు. మరోవైపు.. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు కూడా ముందుకు రావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే అసు శత్రువని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడని నెతన్యాహు పేర్కొన్నారు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని, అలాగే, ప్రత్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే మనస్తత్వం ట్రంప్‌ది కాదన్నారు. గతంలో కూడా ఆయన ఓ నకిలీ ఒప్పందాన్ని పక్కన బెట్టారని, ఖాసిమ్‌ సులేమానీని మట్టుబెట్టారని గుర్తు చేశారు. అప్పటి ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని పక్కన బెట్టారన్నారు. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని, అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదని, అందుకే ట్రంప్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెతన్యాహు అన్నారు. దీంతో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదటి శత్రువుగా మారారని, అందుకే ఆయనను చంపాలని టెహ్రాన్‌ చూస్తోందని బెంజమిన్‌ నెతన్యాహు ఆరోపించారు.

ప్రపంచ దేశాలన్నింటికీ ఇరాన్‌ పెనుముప్పుగా పరిణమిస్తోందని, ఇజ్రాయెల్‌ ప్రధాని ఆరోపించారు. అందుకే, దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ముప్పును సమూలంగా తొలగించేదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్‌ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా.. యావత్‌ ప్రపంచాన్నీ రక్షిస్తోందన్నారు.


Politent News Web4

Politent News Web4

Next Story