New Green Card Rules: గ్రీన్‌కార్డు కొత్త నిబంధనలు: అందరికీ సమానంగా వర్తించవు!
అందరికీ సమానంగా వర్తించవు!

New Green Card Rules: అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే తాత్కాలిక వలసదారులు ఇకపై తప్పనిసరిగా స్వదేశానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త నిబంధన అన్ని వర్గాల వలసదారులకూ సమానంగా వర్తించదని తాజా సమాచారం.
అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలకు ముఖ్యంగా ఉపయోగపడే వలసదారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. గ్రీన్‌కార్డు ఆశావహులు సమర్పించిన దరఖాస్తులు అమెరికాకు లాభదాయకం అని భావిస్తే, వారిని ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగనివ్వవచ్చని అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పనిసరిగా తమ మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ మాట్లాడుతూ, “అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే వలసదారుల దరఖాస్తులను ప్రత్యేకంగా పరిగణిస్తాం. అయితే ఏ ప్రమాణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారో వివరించలేదు” అని చెప్పారు.
ఇంతకుముందు వెలువరించిన నిబంధనల ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకునేవారి అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త నియమాలతో గ్రీన్‌కార్డు వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త నిబంధనలు భారతీయులతో సహా పలు దేశాల వలసదారులపై ప్రభావం చూపనున్నాయి.

