New Twist in Nepal Politics: నేపాల్ రాజకీయాల్లో కొత్త ముసురు: తాత్కాలిక నేతృత్వంపై జెన్-జెడ్ విభేదాలు
తాత్కాలిక నేతృత్వంపై జెన్-జెడ్ విభేదాలు
New Twist in Nepal Politics: నేపాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి మరింత ఉద్ధృతమైంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కోసం ‘జెన్-జెడ్’ ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, చర్చలు ఫలవంతం కావడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేసి, ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని, అలాగే రాజ్యాంగ సవరణ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ జోలికి వెళ్లొద్దని హెచ్చరిక
ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సింగ్డెల్‌తో జెన్-జెడ్ ప్రతినిధులు ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సమయంలో, జెన్-జెడ్ గ్రూప్‌లోని మరికొందరు ప్రతినిధులు మీడియా సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉద్యమాన్ని ఉపయోగించుకోవద్దని పాత రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉద్యమం పూర్తిగా పౌర ఉద్యమమని, రాజకీయ లబ్ధి కోసం తమను ఉపయోగించుకోవద్దని స్పష్టం చేశారు. జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, సంక్షోభ సమయంలో నేపాల్ పౌరులంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు.
నాయకత్వ ఎంపికపై చర్చలు
తాత్కాలిక నాయకత్వ ఎంపిక విషయంలో జెన్-జెడ్ ఉద్యమకారులు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేర్లను ప్రతిపాదించినప్పటికీ, ఆందోళనకారుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఇతర కొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాలపై నేపాల్ ఆర్మీ స్పందిస్తూ, వివిధ పక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింద.
హింసలో 34 మంది మృతి
నేపాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1338 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వీరిలో 949 మంది కోలుకున్నట్లు పేర్కొంది.
