Nijjar Murder Case: నిజ్జర్ హత్య కేసు: అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్‌పై కీలక ఆరోపణలు
కీలక ఆరోపణలు

Nijjar Murder Case: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా దర్యాప్తు అధికారులు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని సహచరుడు గోల్డీ బ్రార్‌పై కేసు నమోదు చేశారు. నిజ్జర్ హత్యకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు.
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అంతర్జాతీయ స్థాయిలో ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’ అనే ఆపరేషన్‌ను చేపట్టింది. దీని భాగంగా అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్ మరియు గోల్డీపై అభియోగాలు నమోదయ్యాయి. గోల్డీ బ్రార్‌పై 50,000 డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.
2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఆధారాలు ఇవ్వాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
కెనడా ఆరోపణలు కొనసాగించడంతో పాటు, హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి. తర్వాత మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధాల్లో కొంత పునరుద్ధరణ కనిపించింది.
ఈ కేసు భారత్-కెనడా సంబంధాలపై ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. అమెరికా చేసిన తాజా చర్యలు ఈ విషయంలో కొత్త మలుపు తెచ్చాయి.

