Governor Greg Abbott: టెక్సాస్‌ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌-1బీ (H-1B) వీసా దారులను నియమించుకోకూడదని గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక ప్రతిపాదన చేశారు. విదేశీ ప్రభావాన్ని తగ్గించే దిశగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో కొత్త హెచ్‌-1బీ దరఖాస్తులపై నిషేధం ఉంది. ఇప్పుడు ఆ నిబంధనను ప్రభుత్వ పాఠశాలలకు కూడా విస్తరించాలని అబాట్‌ ప్రతిపాదించారు. “టెక్సాస్‌ ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌-1బీ వీసాదారులు సున్నా ఉండాలి” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త దరఖాస్తులతో పాటు, ప్రస్తుతం పని చేస్తున్న వారికి కూడా ఈ నిషేధం వర్తించేలా చట్టం తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి ప్రభుత్వ పాఠశాలలు కానుకలు, ధనం లేదా ఆస్తులు స్వీకరించడం, ఆర్థిక ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు చేసుకోవడం వంటివాటిపైనా నిషేధం విధించాలని అబాట్‌ సూచించారు. “మన తరగతి గదుల్లో ఏ రకమైన విదేశీ ప్రభావానికీ చోటు లేదు” అని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది టెక్సాస్‌ చట్టసభలు సమావేశం కానున్నాయి. అందులో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. సభల్లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌ సంతకంతో ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.

అయితే, ఈ చట్టం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్న కొన్ని పాఠశాలలకు ఇబ్బంది కలగొచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే టెక్సాస్‌లోని చాలా ప్రభుత్వ పాఠశాలలు హెచ్‌-1బీ కింద ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. అమెరికా జాతీయ విద్యా అధ్యయనం ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్సాస్‌ పాఠశాలల్లోనే ఎక్కువ మంది హెచ్‌-1బీ ఉద్యోగులున్నారు. ఒక్క డల్లాస్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లోనే 171 మంది ఉపాధ్యాయులు ఈ వీసా కింద పని చేస్తున్నట్లు ఫెడరల్‌ గణాంకాలు చూపిస్తున్నాయి.

గవర్నర్‌ అబాట్‌ ఈ చర్యను “టెక్సాస్‌ ఉద్యోగాలు మొదట టెక్సాస్‌ వాసులకే” అనే విధానంలో భాగంగా ప్రకటించారు. విదేశీ వీసాల ద్వారా స్థానికుల ఉద్యోగాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ఆయన గతం నుంచీ నొక్కి చెబుతున్నారు.

ఈ ప్రతిపాదనపై చట్టసభలో చర్చ జరగడం, ఆమోదం పొందడం వంటి అంశాలు రాబోయే నెలల్లో స్పష్టమవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story