Dhaka Responds: భారత్‌తో సంబంధాలు దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు: హసీనా వ్యాఖ్యలపై ఢాకా స్పందన
హసీనా వ్యాఖ్యలపై ఢాకా స్పందన

Dhaka Responds: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించిన ఆమె తాజాగా మీడియా ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలో పత్రికా విలేకరులను ఉద్దేశించి బుధవారం (ఆగస్టు 5) ఆమె ప్రసంగించనున్నారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది.
పొరుగు దేశం భారత్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు చెడిపోవాలని తాము కోరుకోవట్లేదని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పొరుగు దేశం నుంచి హసీనా సహా ఇతర అవామీ లీగ్ నాయకులు రాజకీయ ప్రకటనలు చేయడంపై తమ ఆందోళనలను ఇప్పటికే పలుమార్లు భారత్‌కు తెలియజేశామని ఆమె వెల్లడించారు. హసీనా మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
మరోవైపు హసీనా ప్రసంగాలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఆడియో/వీడియో సందేశాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమ దేశంలోని మీడియా సంస్థలను హెచ్చరించింది.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు ఫలితంగా అధికారాన్ని కోల్పోయి భారత్‌కు పారిపోయి వచ్చిన అనంతరం హసీనా విలేకరులను ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఆమె వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఇందులో ఆమె బంగ్లాదేశ్‌కు ఎప్పుడు వెళ్తారనే విషయంతో పాటు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్, ఇతర అవామీ లీగ్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంతో తమకెలాంటి సంబంధం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. దీనిని ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేస్తోందని వెల్లడించింది.

