North Korea: కిమ్ జోంగ్ ఉన్ వారసత్వం కుమార్తె కిమ్ జు యే చేతికే! దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తాజా అంచనా
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తాజా అంచనా

North Korea: ఉత్తర కొరియా సర్వాధికారి కిమ్ జోంగ్ ఉన్ తన వారసత్వ బాధ్యతలను తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేకు అప్పగించే అవకాశాలు బలంగా ఉన్నాయని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్) తాజా అంచనా వేసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులకు ఎన్‌ఐఎస్ అధికారులు తెలిపారు.
కిమ్ జు యేను 2022లో తండ్రి కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె వివిధ అధికారిక కార్యక్రమాల్లో, సైనిక పరేడ్‌లు, పరీక్షలు, పార్టీ సమావేశాల్లో కనిపిస్తోంది. ఈ దృశ్యాలన్నీ ఆమె వారసురాలిగా ఎదుగుతున్నట్లు సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదట్లో ఎన్‌ఐఎస్ ఉత్తర కొరియాలో పురుషాధిక్య నాయకత్వ సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకుని, కుమార్తెకు అధికారం అప్పగించే అవకాశం తక్కువగా ఉందని అంచనా వేసింది. కానీ ఇటీవలి కాలంలో కిమ్ జు యే మీడియాలో ఎక్కువగా కనిపించడం, ఆమె ప్రముఖ స్థానంలో ఉండటం వల్ల ఎన్‌ఐఎస్ తన అంచనాను పునఃపరిశీలించింది. ఇప్పుడు ఆమె వారసత్వం కోసం కీలక దశలో ఉన్నట్లు తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్ కూడా తండ్రి కిమ్ జోంగ్ ఇల్ నుంచి వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చారు. ఈ నెలాఖరులో ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ ముఖ్య సదస్సు జరగనుంది. ఈ సమావేశంలోనే కిమ్ తన వారసత్వ ప్రణాళికలను అధికారికంగా పార్టీ ఆమోదం పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాలు ఉత్తర కొరియా రాజకీయ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి.

