అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం!

Nuclear Twist: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా మారాలని ఆశించిన శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో విఫలమయ్యాయి. దాదాపు 21 గంటల పాటు సాగిన మ్యారథాన్ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఆదివారం ఇరు పక్షాల ప్రతినిధులు ఒప్పందం లేకుండానే పాక్‌ను వీడారు.

ఈ చర్చల్లో ప్రధాన అడ్డంకి అణ్వస్త్రాల సమస్యే అయింది. అణ్వస్త్రాల తయారీ ప్రణాళికలను పూర్తిగా త్యజించాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేసింది. అయితే ఇరాన్ ఈ డిమాండ్‌కు ససేమిరా అన్నట్లు స్పందించింది. అమెరికా అక్రమమైన, అతిగా డిమాండ్లు చేస్తోందని టెహ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

చర్చల విఫలతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హార్ముజ్ జలసంధిని తాము దిగ్బంధించేస్తామని, ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకల రాకపోకలను అడ్డుకుంటామని సంచలనాత్మక హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ అణు మెలికలు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సరైన సమయంలో దాని ఖేల్ ఖతం చేస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చర్చలకు నాయకత్వం వహించారు. చర్చలు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, “మంచి వార్త ఏమిటంటే చర్చలు జరిగాయి. చెడు వార్త ఏమిటంటే ఒప్పందం కుదరలేదు. ఇది ఇరాన్‌కు మరింత చెడ్డ వార్త” అని అన్నారు. ఇరాన్ అమెరికా డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించిందని వాన్స్ స్పష్టం చేశారు.

మరోవైపు పాకిస్థాన్ మాత్రం శాంతి చర్చలు కొనసాగించాలని వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగడం ద్వారా ప్రాంతీయ శాంతికి తను కృషి చేస్తుందని పాక్ ప్రకటించింది.

ఈ విఫల చర్చలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్‌తో ఇటీవలి సంఘర్షణల నేపథ్యంలో ఈ చర్చలు జరిగినప్పటికీ, రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఇంకా పరిష్కారం కాలేదు.

ఇప్పటికైతే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని అంచనా వేస్తున్నా, శాశ్వత శాంతి ఎప్పుడు సాధ్యమవుతుందనేది అనిశ్చితంగానే ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story