అసలు లక్ష్యం చమురే: కమలా హారిస్

Kamala Harris: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చర్య వెనుక డ్రగ్స్ నిరోధం లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ అనే సాకులు కేవలం అబద్ధాలేనని, నిజానికి వెనెజువెలా చమురు నిల్వలే ప్రధాన ఉద్దేశ్యమని ఆమె ఆరోపించారు.

‘‘ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాను మరింత బలోపేతం చేయదు, సురక్షితం చేయదు. మదురో ఒక క్రూరమైన నియంత, చట్టవిరుద్ధమైన పాలకుడు అనేది వేరే విషయం. కానీ ఈ ఆపరేషన్ పూర్తిగా చట్టవిరుద్ధం, అవివేకపూరితమైనది. అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి, బిలియన్ల డాలర్లు వెచ్చించి, మొత్తం లాటిన్ అమెరికా ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్నారు. దీనికి ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేదు, దీర్ఘకాలిక ప్రణాళిక లేదు, అమెరికాకు లాభం లేదు’’ అని హారిస్ స్పష్టంగా వెల్లడించారు.

అమెరికా ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పని చేసే కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడం, చట్టపరమైన పాలన, మిత్రదేశాలతో సంబంధాలు బలోపేతం చేయడం వంటి నాయకత్వమే ఇప్పుడు కావాలని ఆమె నొక్కి చెప్పారు.

ఈ ఆపరేషన్ తర్వాత వెనెజువెలాలో రాజకీయ అస్థిరత మరింత పెరిగిందని, అమెరికా విదేశాంగ విధానంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story