One Big Beautifu : చట్టంగా మారిన వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు
బిల్లుపై సంతకం చేసిన ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్

అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ సంతకంతో వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు చట్టంగా మారింది. అమెరికా అధ్యక్షుడి అధికార సౌధం శ్వేత భవనంలో రిపబ్లికన్ సభ్యులు, అధికారుల కోలహలం మధ్య వేడుకగా జరిగిన కార్యక్రమంలో డోనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై సంతకం పెట్టారు. సంతకం అనంతరం రూలింగ్ ఇస్తున్నట్లుగా చెక్క సుత్తితో టేబుల్ పై కొట్టారు. ఈ సందర్భంలో ట్రంప్ హావభావాలతో కూడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక చారిత్రక విజయమన్నట్లుగా ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున వైట్ హౌస్ సిబ్బంది, మిలటరీ కుటుంబాలు, ట్రంప్ మద్దతు దారులు, మిత్ర పక్షాలు హాజరయి సంబరాలు చేసుకున్నాయి. వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై సంతకం చేసిన అనంతరం ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ నూతన చట్టంతో అమెరికన్లు అందరికీ లబ్ది చేకూరుతుందని అన్నారు. మిలటరీ సిబ్బంది నుంచి రోజువారీ కార్మికుల వరకూ వన్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం మద్దతుగా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్ను, వ్యయాల కోతతో పాటు సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని చెప్పుకొచ్చారు. వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారే క్రమంలో మద్దతుగా నిలబడ్డ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్, సెనెట్ మెజార్టీ నాయకుడు జాన్ ధునెలకు ఈ సందర్భంగా ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు.
