Trump’s Sensational Statement: పాక్ రహస్యంగా అణుపరీక్షలు.. మేము కూడా చేయాల్సిందే: ట్రంప్ సంచలన ప్రకటన!
మేము కూడా చేయాల్సిందే: ట్రంప్ సంచలన ప్రకటన!

Trump’s Sensational Statement: మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణుపరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యానికి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రష్యా విజయవంతమైన అణుపరీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు రహస్యంగా అణుపరీక్షలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, అమెరికా కూడా ముందుకు సాగాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.
ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, "ఇతర అణుశక్తి దేశాలు పరీక్షలు చేస్తుంటే, మేము మాత్రమే ఎందుకు వెనక్కి తగ్గాలి? మేము కూడా మా అణుఆయుధాలను పరీక్షించాల్సిందే" అని అన్నారు. పాకిస్తాన్, చైనా గుట్టుచప్పుడు అణుపరీక్షలు చేస్తున్నాయని, ఉత్తర కొరియా, రష్యా కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. "అణునిరాయుధీకరణ అందరికీ మంచిదే. కానీ ఇతరులు దూకుడు చూపిస్తుంటే, మేము మాత్రమే నిశ్శబ్దంగా ఉండలేము" అంటూ ట్రంప్ తన నిర్ణయాన్ని బలపరిచారు.
అమెరికా వద్ద ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయగలిగిన అణుఆయుధాల స్టాక్ ఉందని, రష్యా, చైనా కంటే మరింత ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. "మేము చెప్పకపోతే మీరు రిపోర్ట్ చేస్తారు. కానీ చైనా, రష్యాలో అలాంటి జర్నలిస్టులు ఎక్కడో" అంటూ మీడియా వ్యాఖ్యాతలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రకటనతో అమెరికా సైన్యం అణుపరీక్షలకు సిద్ధమవుతోంది. ప్రపంచ దేశాలు ఈ అణు పోటీ మళ్లీ ఊపందుకుంటుందా అనే ఆందోళనలో మునిగిపోయాయి.
ఈ నిర్ణయం రష్యా అణుపరీక్షల తర్వాత కొన్ని రోజుల్లో వచ్చింది. అణునిర్వాహక ఒప్పందాలు దెబ్బతింటాయా, ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుందా అనే చర్చలు రష్యా, చైనా, ఐక్యరాజ్యసమితి వర్గాల్లో మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ పరీక్షలతో తన అణుశక్తిని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు అంచనా.

