ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని

Pakistan PM Shehbaz Sharif: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించేందుకు ఈజిప్టులోని షర్మ్-షేక్‌లో జరిగిన శాంతి ఒప్పందంపై పలు దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో మునిగితేలారు. ట్రంప్ లాంటి గొప్ప నాయకుడు ఎవరూ లేరని, ఆయన ప్రపంచ శాంతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఆశ్చర్యపోయి, తనకు ఇక మాట్లాడేందుకు ఏమీ లేదని, ఇంటికి వెళ్దామని చమత్కరించారు. దీంతో సభాప్రాంగణంలో నవ్వులు విరిశాయి.

షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో, "ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో గాజాలో శాంతి సాధన జరిగింది. ఆయన శాంతి కోసం నిజాయితీగా కృషి చేశారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, సమృద్ధితో నడిపించేందుకు అవిరామంగా పనిచేశారు," అని పేర్కొన్నారు. అంతేకాక, భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను ట్రంప్ ఆపారని, ఆయన అసాధారణ ప్రయత్నాలతో కాల్పుల విరమణ సాధించారని కితాబిచ్చారు. "భారత్, పాకిస్థాన్ రెండూ అణ్వాస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల ఘర్షణ సమయంలో ట్రంప్, ఆయన బృందం జోక్యం చేసుకోకపోతే, ఆ ఘర్షణ పశ్చిమాసియాకు వ్యాపించి ఉండేది. ఫలితంగా ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ మిగిలేవారు కాదు," అని షరీఫ్ వ్యాఖ్యానించారు.

ఈ సేవలకు గుర్తింపుగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ నామినేట్ చేసిందని షరీఫ్ తెలిపారు. "ఇప్పటివరకు ఏడు యుద్ధాలను ఆపిన ట్రంప్, ఇది ఎనిమిదో యుద్ధం ఆపారు. ఆయన ఈ బహుమతికి అర్హుడు," అని ఆయన పేర్కొన్నారు. షరీఫ్ ప్రసంగం విన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆశ్చర్యంతో నోటిపై చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు.

షరీఫ్ పొగడ్తలతో ఉప్పొంగిపోయిన ట్రంప్, "ఇలాంటి ప్రశంసలు తాను ఊహించలేదు. ఇక నేను మాట్లాడేందుకు ఏమీ మిగల్లేదు. ఇంటికి వెళ్దాం," అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు. ఈ చమత్కారంతో సభలో ఉన్నవారంతా నవ్వులతో హోరెత్తించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story