Pakistan PMO: పాక్ పీఎంఓ చేసిన దుర్బుద్ధి.. ఎస్‌సీఓ గ్రూప్ ఫొటోలో మోదీని క్రాప్ చేసి షేర్
మోదీని క్రాప్ చేసి షేర్
Pakistan PMO: కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా సభ్య దేశాల నాయకులు తీసుకున్న గ్రూప్ ఫొటోను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని పూర్తిగా తొలగించి, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మధ్యలో ఉన్నట్లు చూపించేలా క్రాప్ చేసిన ఫొటోను పాక్ పీఎంఓ ఎక్స్‌లో షేర్ చేసింది.
మంగళవారం జరిగిన సదస్సులో 10 సభ్య దేశాల అధినేతలు కలిసి ఫొటో దిగారు. అయితే పాక్ విడుదల చేసిన చిత్రంలో మోదీతో పాటు ఇరాన్ అధ్యక్షుడు సహా మరికొందరు నేతలు కనిపించలేదు. వాస్తవానికి అసలు ఫొటోలో షెహబాజ్ షరీఫ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పూర్తి గ్రూప్ ఫొటోను షేర్ చేశారు. అందులో పాక్ ప్రధాని సహా అందరు నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు.
అంతటితో ఆగకుండా షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఎస్‌సీఓ నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశ వీడియోను కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఆ వీడియోలోనూ ప్రధాని మోదీ ఉన్న భాగాన్ని తొలగించారు. ఈ చర్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాక్ తీరును ‘చిన్నపిల్లల సోషల్ మీడియా ట్రిక్’ అంటూ విమర్శించారు. కొందరు షెహబాజ్ షరీఫ్ చేతిలో బిక్షాటన పాత్ర ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు.
ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ పాక్ ప్రధాని సమక్షంలోనే ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ చేసిన ఈ ఎడిటింగ్ చర్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి.



