US Army Chief Randy George: ఇరాన్ యుద్ధం మధ్యలో అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు.. పీట్ హెగ్సెత్ ఆదేశంతో జనరల్ ర్యాండీ జార్జ్ పదవి విరమణ
పీట్ హెగ్సెత్ ఆదేశంతో జనరల్ ర్యాండీ జార్జ్ పదవి విరమణ

US Army Chief Randy George: ఇరాన్‌పై భీకర దాడులు కొనసాగుతున్న కీలక సమయంలో అమెరికాలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్‌ను పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకున్నట్లు పెంటాగాన్ వర్గాలు ధృవీకరించాయి.
రక్షణ విభాగాన్ని పూర్తిగా పునరుద్ధరించాలనే లక్ష్యంతో పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్, అడ్మిరల్స్‌ను పదవుల నుంచి తొలగించారు. ఇప్పుడు ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారి అయిన జనరల్ ర్యాండీ జార్జ్ కూడా ఈ జాబితాలో చేరారు.
వెస్ట్‌పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జనరల్ ర్యాండీ జార్జ్ గల్ఫ్ యుద్ధం, ఇరాక్, అఫ్ఘానిస్తాన్ యుద్ధాల్లో సేవలందించారు. జో బైడెన్ పాలనలో 2021-2022 మధ్యకాలంలో రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు సహాయకుడిగా కూడా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో హెగ్సెత్ అనేక ఉన్నత స్థాయి అధికారులను తొలగించినప్పుడు జార్జ్ బయటపడ్డా.. తాజాగా ఆయనపై కూడా వేటు పడింది.
ఆకస్మిక పదవీ విరమణ నేపథ్యంలో అమెరికా సైన్యం జనరల్ ర్యాండీ జార్జ్ సేవలను మెచ్చుకుంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇదిలా ఉండగా, యూఎస్ దళాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పీట్ హెగ్సెత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల్లోకి సైనికులు తమ వ్యక్తిగత ఆయుధాలు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దళాల వ్యక్తిగత రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెగ్సెత్ ఒక వీడియో సందేశంలో స్పష్టం చేశారు.

