Iran War: ఇరాన్ యుద్ధంపై అంతర్గత విభేదాలు - పీట్ హెగ్సెత్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం
పీట్ హెగ్సెత్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం

Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం సంబంధించి చేస్తున్న వివిధ ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం సృష్టిస్తున్నాయి. తనపై వచ్చే విమర్శల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇతరులపై బాధ్యతలు మోపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఇరాన్‌పై సైనిక దాడి చేయాలని మొదట సూచించింది యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అని ట్రంప్ స్పష్టం చేశారు.
టెన్నెసీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టడానికి ముందు కొందరు అధికారులతో తాను జరిపిన చర్చల గురించి వివరించారు. “నేను పీట్‌తో సహా అనేకమంది యూఎస్ అధికారులకు ఫోన్ చేశాను. పశ్చిమాసియాలో ఉన్న సమస్యను వివరించాను. కొన్ని రోజుల పాటు సైన్యంతో అక్కడ పోరాడి ఆ సమస్యను పరిష్కరించాలని ప్రస్తావించాను” అని ట్రంప్ చెప్పారు.
టెహ్రాన్‌పై దాడికి మొదట మద్దతు తెలిపింది పీట్ హెగ్సెత్ అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. తన పక్కనే కూర్చున్న హెగ్సెత్‌ను చూపుతూ “పీట్.. ఈ విషయంపై మొదట మాట్లాడింది మీరే అనుకుంటున్నా. ‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. కాబట్టి మనం దాడి చేద్దాం’ అని మీరే అన్నారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఈ అంశంపై హెగ్సెత్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు, ఇరాన్‌తో యుద్ధం విషయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై తమ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలన్నింటినీ లక్ష్యంగా చేసుకోవడం తమను ఆశ్చర్యపరిచిందని, దీని గురించి తాము ఆలోచించలేదని ట్రంప్ తెలిపారు.

