Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ వర్చువల్‌గా పాల్గొన్న కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది.

మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు దుండగులు ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. భారీ శబ్దంతో మంటలు రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు మంటలను ఆర్పివేసి ఆస్తి నష్టం జరగకుండా చూసుకున్నారు. ఆ సమయంలో షకీబ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని మోహరించారు.

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున షకీబ్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వం రద్దయిన నేపథ్యంలో ఆయన పదవి కూడా పోయింది.

మరోవైపు, హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండేళ్ల నుంచి వేలాది మంది, ముఖ్యంగా అవామీ లీగ్ నాయకులు జైళ్లలో మగ్గుతున్నారని, వారికి బెయిల్ కూడా ఇవ్వట్లేదని ఆయన అన్నారు. వీరిలో చాలా మంది 80 ఏళ్ల పైబడిన వారేనని, పోలీస్ కస్టడీలోనే కొందరు ప్రాణాలు వదిలారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌లా మారిందని కూడా ఆయన విమర్శించారు. హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story