PoK Leaders Warn Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జులై 9న ఫైనల్ యాక్షన్ ప్రారంభిస్తామని జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పాక్ సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది.

ఈ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు జేఏఏసీ పిలుపు ఇచ్చింది. జులై 9న పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఓఐసీ), ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. డెడ్‌లైన్ వరకు క్షమశీక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది.

పాక్ ప్రభుత్వం చేస్తున్న అణచివేతలు, పౌరుల హత్యలను అంతర్జాతీయ సమాజం గమనించాలని జేఏఏసీ అభ్యర్థించింది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించింది. సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలి, ఆహారం-మందుల సరఫరాను అడ్డుకోవద్దు, నిర్బంధంలో ఉన్న నాయకులను విడుదల చేయాలి, 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రజల డిమాండ్లకు తూటాలతో స్పందిస్తే ఇతర మార్గాలు ఉన్నాయని పాక్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది.

ఈ క్రమంలో జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. “మాకు భారత్ సహాయం కావాలి. ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది. మానవతా సాయం అందించండి” అని ఆయన కోరినట్లు ఉంది. నిరసనలను కఠినంగా అణచివేస్తున్న పాక్ ఆర్థిక దిగ్బంధనం విధించిందని ఆరోపించారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్‌కు వచ్చేందుకు నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

గత కొన్ని రోజులుగా పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చిన జేఏఏసీని పాక్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. కమిటీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది. నిరసనకారులను అణచివేయడానికి పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసరాలు, ఆహారం, మందులను అడ్డుకుంటోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story