Shocking Remarks by Trump: రష్యా విమానాలను కూల్చే అవకాశం ఉంది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విమానాలను కూల్చే అవకాశం ఉంది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Shocking Remarks by Trump: రష్యా, నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. రష్యా ఫైటర్ జెట్‌లు నాటో సభ్య దేశాల గగనతల సరిహద్దులను ఉల్లంఘించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రష్యా విమానాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక విలేకరి, "నాటో దేశాలు రష్యా విమానాలను కూల్చాలా?" అని ప్రశ్నించగా, ట్రంప్, "అవును, కూల్చేస్తాం" అని స్పష్టంగా తెలిపారు.
ఇటీవల పోలాండ్, ఎస్తోనియా వంటి నాటో దేశాల సరిహద్దుల్లోకి రష్యా యుద్ధ విమానాలు చొరబడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ 2014 నుంచి కోల్పోయిన తన భూభాగాన్ని తిరిగి పొందగలదని, ఈ యుద్ధం రష్యాను ఆర్థికంగా బలహీనపరిచిందని ఆయన పేర్కొన్నారు. "రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పెట్రోలియం ఆదాయం తగ్గడంతో యుద్ధానికి నిధులు సమకూర్చడం కష్టంగా మారింది. నాటో, ఐరోపా సమాఖ్య మద్దతుతో ఉక్రెయిన్ తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు," అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. ట్రంప్ వ్యాఖ్యలు గేమ్ ఛేంజర్‌గా ఉంటాయని, యుద్ధక్షేత్రంలో జరుగుతున్న పరిణామాలను తాను ట్రంప్‌కు వివరించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మాత్రం భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సైనిక చర్యలతో కాకుండా, చర్చల ద్వారానే పరిష్కరించాలని, అమెరికా శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
