New Zealand: న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో జూలై 16, 2026 గురువారం రాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తొలుత 6.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 5.9గా సవరించబడింది. భూకంపం కేంద్రం టె అనావ్ (Te Anau) పట్టణానికి సుమారు 40 కి.మీ. ఉత్తరంగా ఫియార్డ్‌ల్యాండ్ ప్రాంతంలో ఉంది.

భూకంపం తీవ్రత కారణంగా తీరప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా అంతర్గత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అయితే, తర్వాతి సమాచారం మేరకు సునామీ హెచ్చరికను కేవలం అడ్వైజరీగా (సలహా) మార్చారు. సునామీ సంకేతాలు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా భవనాలు కంపించాయని, కానీ తక్షణం గాయాలు లేదా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. టూరిస్ట్ హాట్‌స్పాట్‌లైన ఫియార్డ్‌ల్యాండ్ ప్రాంతం ప్రభావితమైంది. స్థానికులు, పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు.

న్యూజిలాండ్ ఆస్ట్రేలియా-పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటం వల్ల భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. గతంలో 2011లో క్రైస్ట్‌చర్చ్ భూకంపంలో 185 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story