Ethiopia’s Highest Civilian Honour: ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర గౌరవం
అత్యున్నత పౌర గౌరవం

Ethiopia’s Highest Civilian Honour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశం తన అత్యున్నత పౌర పురస్కారం 'ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రదానం చేసింది. ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ చేతుల మీదుగా అడ్డిస్ అబాబాలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును మోదీ అందుకున్నారు. ప్రపంచ నాయకుడిగా తొలిసారిగా ఈ గౌరవాన్ని అందుకున్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇది మోదీకి లభించిన 28వ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం.
ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ప్రాచీనమైన, సంపన్నమైన నాగరికతలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ గౌరవం లభించడం గొప్ప గర్వకారణం. ఈ అవార్డును నేను వినయంతో, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని 140 కోట్ల భారతీయులకు, రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించిన భారతీయులు, ఇథియోపియన్లకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు, సైనికులు, ఉపాధ్యాయులు, నిపుణులు వంటి భారతీయులు శతాబ్దాలుగా రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు.
ఇథియోపియా పర్యటనలో భాగంగా మోదీకి అరుదైన సత్కారాలు లభించాయి. ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ స్వయంగా విమానాశ్రయంలో స్వీకరించి, హోటల్‌కు తీసుకెళ్లారు. పర్యటన ముగిసిన తర్వాత కూడా స్వయంగా విమానాశ్రయానికి తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎచ్చాయి. విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంచేందుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ పురస్కారం భారత్ గ్లోబల్ సౌత్‌లో పెరుగుతున్న ప్రాభవానికి, ప్రధాని మోదీ నాయకత్వానికి నిదర్శనమని రాజకీయ నాయకులు కొనియాడారు. భారత్-ఇథియోపియా స్నేహం మరింత బలోపేతమవుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

