రాజకీయ తరం మార్పు ఖాయం!

Rastriya Swatantra Party Sweeps Victory in Nepal: హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయ భూకంపం సృష్టించింది రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ). దశాబ్దాలుగా అధికారంలో ఉన్న సాంప్రదాయ పార్టీలను ఓడిస్తూ, తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ అద్భుత విజయం సాధించింది. ఈ పార్టీకి చెందిన యువ నేత, రాపర్ నేపాలగా మారిన బాలేంద్ర షా (బాలెన్) నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ప్రకాశిస్తున్నాయి.

నేపాల్ పార్లమెంట్ (ప్రతినిధుల సభ)లో మొత్తం 275 సీట్లు ఉన్నాయి. వీటిలో 165 సీట్లకు ప్రత్యక్ష ఓటింగ్ (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్) విధానంలో ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 110 సీట్లను దామాషా (ప్రొపోర్షనల్) విధానంలో భర్తీ చేస్తారు. మార్చి 5న జరిగిన ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 స్థానాల్లో 159 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో ఆర్‌ఎస్‌పీ అద్భుతంగా 122 సీట్లు గెలుచుకుంది.

రెండో స్థానంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్‌కు కేవలం 17 సీట్లు వచ్చాయి. మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్ - సీపీఎన్-యూఎంఎల్)కు 8 సీట్లు మాత్రమే దక్కాయి. మరో రెండు చోట్ల ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి 7 సీట్లు వచ్చాయి.

కాఠ్‌మాండూ లోయలోని మూడు జిల్లాల్లోని 15 నియోజకవర్గాలన్నీ ఆర్‌ఎస్‌పీ క్లీన్ స్వీప్ చేసింది. 35 ఏళ్ల బాలెన్ ప్రధానిగా ఎన్నికైతే, నేపాల్ చరిత్రలో తొలి మాధేసీ నేతగా, అతి పిన్న వయసు ప్రధానిగా రికార్డు సృష్టిస్తారు. ఝాపా-5 నియోజకవర్గంలో బాలెన్.. మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలిని 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

ఆర్‌ఎస్‌పీని 2022లో రవి లమిచానే స్థాపించారు. ఈ ఎన్నికల్లో ఆయన చిత్వాన్-2 నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచారు.

ప్రముఖ నేతల పరాజయం

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ థాపా ధనుషా-4లో ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నేపాలీ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా థాపాను ప్రకటించిన సంగతి గమనార్హం. పార్టీ సీనియర్ నేతలు గురురాజ్ ఘిమిరె, శేఖర్ కోయిరాల, బిమలేంద్ర నిధి కూడా ఓటమి చవి చూశారు. సీపీఎన్-యూఎంఎల్ ఉపాధ్యక్షులు బిష్ణు పౌడెల్, పృథ్వి సుబ్బా గురుంగ్, గోకర్ణ బిస్త వంటి వారు కూడా ఓడిపోయారు.

దామాషా ఓట్లలోనూ ఆధిక్యం

దామాషా విధానంలో ఆర్‌ఎస్‌పీకి 28,53,096 ఓట్లు వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్‌కు 9.58 లక్షలు, సీపీఎన్-యూఎంఎల్‌కు 8.28 లక్షల ఓట్లు వచ్చాయి.

మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ రుకుమ్ పుర్బాలో గెలిచారు. మరో మాజీ ప్రధాని మాధవ్ నేపాల్ రౌతాహట్-1లో ఓడిపోయారు.

ఈ ఎన్నికలు నేపాల్ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వానికి బాటలు వేశాయి. యువత, జనరల్ జెడ్ తరం మద్దతుతో ఆర్‌ఎస్‌పీ అధికారంలోకి రావడం దేశ చరిత్రలో మలుపు తిరిగే సంఘటనగా నిలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story